sri Shankara chidvilasamu    Chapters   

పీఠిక

బృందావనమను కృష్ణామండల ముఖ్యపట్టణమైన బందరు పట్టణములో నా పూర్వశ్రమములో నాచే స్థాపింపబడిన శంకరమఠములో 1942వ సంవత్సరపు శంకరజయంతి పుణ్యదివసమున ప్రాతఃకాలమునందు శ్రీ జగద్గురు శ్రీ శంకర భగవత్పూజ్యపాదుల, ఊరేగింపుటుత్సవమును మధ్యాహ్నము పూజాదికము - సంవత్పరణమున్నూ సాయంకాలము ఆ పూజ్యపాదుల చరితమునుగూర్చి యుపన్యాసమున్నూ గావించితిని. ఇట్లా దినమంతయు పవిత్రముగ గడపి ఆ రాత్రి నిద్రించగా ఆ రాత్రి రెండు గంటల ప్రాంతమున నూతనముగా ఉబ్బసపు దగ్గు ఆయాసము వచ్చి నిద్రాభంగమై మిక్కుటముగ బాధ కల్గినది. ఊపిరి అడకపోవటచేత ఆ బాధ చాలా దుర్భరము కాగా ఆత్మహత్య చేసికొనిన బాగుండునని అని పించినది. కాని వెంటనే ''ఈ పవిత్రమైన శంకర జయంతినాడు ఎంతో భక్తితో శంకర పూజ్యపాదుల సేవచేసిన నాకు ఇట్టి యపవిత్రమైన ఆత్మహత్యా సంకల్ప మేలకల్గెను''? ''అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః వర్యుపాసతే| తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం మహామ్యహం||'' ''నమే భక్తః ప్రణశ్యతి'' అని భక్త రక్షణ కంకణమును ధరించిన భగవానుడే శంకర రూపమున నవతరించగా అట్టి శంకరులవారి భక్తుడనైవారి సేవ గావించిన నన్ను ఆశంకరుడు రక్షించడా? తప్పక రక్షించును వారినే ధ్యానించెదను'' అని నిశ్చయించుకొని యలనాడు ద్రౌవది. గజేంద్రుడు, ఆర్తితోను, ఏకాగ్రతతతోను భగవంతునితో మొరపెట్టినట్లు శంకరులకు మొరపెట్టగా ''లిఖ శంకర చారిత్రం'' అని అంతర్వాణి స్ఫురణము కలిగెను. అంతట మనస్సు వెంటనే శంకరులయందు లగ్నమై దేహ తాదాత్మ్యముపోయి సంస్కృత భాషలో అనుష్టుప్‌ చందమున శంకరుల దివ్య చరితమును గూర్చిన శ్లోకములు బయలు వెడలినవి. అట్లు శ్లోఖములు వచ్చుచుండగా దేహము పూర్వము వలె నాయాసము పడుచున్ననూ మనస్సున దేహతాదాత్మ్య భావన లేకపోవుటచే నా కేమాత్రము బాధ తోచలేదు. దేహతాదాత్మ్య భావన మున్నప్పుడే కదా దేహ బాధ గోచరించేది. అట్టి దేహభావము అప్పుడు లేకపోవుటచే ఆ బాధయే గోచరించలేదు. అందువలన ఇట్టిశ్లోకములు వచ్చిన తరువాత నిద్రపట్టినది. తెల్లవారిన తరువాత నా శ్లోకములను ధారణచేసి ఒక కాగితముపై వ్రాసితిని. తదాది ప్రతి రోజూ కొన్ని శ్లోకములు శంకర చరిత్రను గురించి వానియంతటనని స్ఫురించుట, వానిని వ్రాసియుంచుట, తటస్థించినది. ఇట్లు సుమారు 30 శ్లోకములు వచ్చిన తరువాత పూర్వాశ్రమములో ది. 16-7-1942న నా భార్య స్వర్గస్థురాలాయెను. తదాది ఆరు మాసముల వరకు కవిత్వము సాగలేదు. ఆ తరువాత కవిత్వము సాగి శంకరుని చరిత్ర శ్లోకరూపమున పూర్తియైనది. ''ఆగతా కవితా ధారా త్వనుష్టుప్‌ శోకరూపిణీ శంకరాచార్య విషయేహ్య పండిత ముఖాన్మమ'' అని కూడా రచించితిని.

ఇట్లీగ్రంథము పూర్తి కాగా దీనికి శంకర చిద్విలాసమని పేరు పెట్టితిని. ఈ గ్రంథరచనము పూర్తియై ఇరువది సంవత్సరములు గడచినను దీని నచ్చువేయుట తటస్థంచలేదు. ఇట్లుండగా గత మాఘమాసంలో పేరుపల్లి గ్రామములో శ్రీ పరసా ప్రకాశరావుగారు నూతనముగా నిర్మించిన భవనములో ది.17.1.1964న మాఘ శుక్ల తృతీయా శుక్రవారము గృహ ప్రవేశమునకు నన్నాహ్వానింపగా నచటికి వెళ్ళి యచ్చట కాలక్షేపములు పూర్తియైన తరువాత కారేపల్లి వాస్తవ్యులైన పర్సా దుర్గాప్రసాదరావుగారు వారి సతీమణి జానకీదేవిగారును నన్ను వారి గ్రామమున కాహ్వానించగా ది. 30-1-1964 సాయంకాలము నేను వారి గ్రామముకు వెళ్ళితిని. వారు వారి యింట్లో ది. 31-1-64 మహావైభవంగా మా పీఠపూజలు గావించి మా పీటమునకు గోవు నొకదానిని సమర్పించిరి. పిదప నాదంపతులు తమకు శంకరభగత్పాదుల చరిత్రను వ్రాయించి అచ్చు వేయించు సంకల్పము కలదని నాతో చెప్పిరి.

అంతట నేను రచించిన ''శంకర చిద్విలాస''మను గ్రంథమును గురించి వారితో చెప్పగా వారు సంస్కృత శ్లోకరూపమున నన్ను ఆ చరిత్రకు తెలుగులో ననువాదముగూడ చేయించిన తామా గ్రంథమును అచ్చువేయించెదమని తమ సహజౌదార్యమును వ్యక్తపరచిరి. ఆగ్రంథము శంకర జయంతినాటికి పూర్తియై ఆ పవిత్రదినమున నావిష్కరింపబడునట్లు చూడుడని కోరిరి.

ఆ తరువాత పీఠముతో చాలా గ్రామములకు వెళ్ళి భక్తిజ్ఞానాది ప్రబోధములను గావించుచు ది. 1-3-1964న అమలాపురముజేరి యచట రెండు నెలలుండి గీతోపన్యాసము లిచ్చితిని. ఆ కాలములో నేను లోగడ రచించిన శంకర చిద్విలాసమును తెలుగు భాషలోకి అనువదించితిని.

తెలంగాణాలో పరసా అనంతరామయ్యగారు అను వారు చాల ప్రఖ్యాత గలవారు. వారు గొప్ప భూస్వాములు. ఐశ్వర్యవంతులు అగుటయేగాక అసదృశమగు నౌదార్యము మరియు దాతృత్వముగల మహాపురుషులు. వారు దేవాలయములను సత్రములనునిర్మించి వేదశాస్త్ర పండితుల ననేకులను సమ్మానించి యాదరించినారు. వారితోనే పరసావారి కుటుంబము ప్రఖ్యాతిలోకి వచ్చినది. వారికి గల ఇర్వురుపుత్రులలో రెండవవారు రామనాధంగారు. ఈ రామనాధంగారు అనేక సత్కార్యములను, సంతర్పణములను గావించి నిరతాన్నదాతలను స్కతీర్తినిబడసినారు. వారి పుత్రరత్నము మన పరసా దుర్గాప్రసాదరావుగారు. వీరు తమ తాతగారియొక్కయు, తండ్రిగారి యొక్కయు ఔదార్యమునకు దాతృత్వమునకు మరియు నన్నదానమునకు నేమాత్రము తీసిపోనివారై విరాజిల్లుచున్నారు. వీరి సతీమణి జానకీదేవి ఆదర్శప్రాయమైననారీరత్నము. ఈమె తండ్రిగారు గొప్ప ప్రఖ్యాతులైన జమీనుదారులునూ విద్వత్కవీంద్రులును విద్యాపోషకులునూ-విజ్ఞాన రసికులును అయిన అమ్మిపాలెం కాపురస్థులు శ్రీ కాళ్ళూరి రాజేశ్వరరావుగారు.

వారి పుత్రికా రత్నమైన ఈ జానకీదేవికి తండ్రిగారి ¸°దార్యము విద్యారసికత్వము, కవితా నైపుణ్యముకూడా లభించినవి. ఆమె ''క్యారేషుదాసీ, కరణషు మంత్రీ, రూపేచ లక్ష్మీః క్షమాయాధరిత్రీ...షట్థర్మయుక్తాకుల ధర్మపత్నీ'' యన్నట్లు షడ్ఢర్మయుక్తమైన గొప్పయిల్లాలు. వీరి దాంపత్యము చాలా ఆదర్శప్రాయమును ప్రశంసనీయమునై యున్నది. ఒకసారి యీ దంపతుల యాతిథ్యమును స్వీకరించినవారు ఎన్నటికిని వీరిని మరువలేరు. మాకు వీరితో ఇప్పటికి సుమారు ఏడు ఎనిమిది సంవత్సరములనుండి పరిచయమున్నది. వీరి మహా వైభవోపేతమైన అతిథ్యము ననేక పర్యాయములు స్వీకరించి ఆనందించినాము. ఇట్టి ఔదార్యవంతులగు పవిత్ర దంపతులు శ్రీ శంకర చిద్విలాసము నచ్చేవేయించుట చాలా అనందదాయకము.

జగత్తునకు నంతటికీ ఏకైక గురువులు శ్రీ శంకరులే. ప్రపంచమున నిట్టి మేధాసంపన్ను లిదివరకు పుట్టలేదు. ప్రపంచఖ్యాతి గాంచిన మేధా సంపన్నులలో సద్వితీయులని the greattest intellect creation has ever seen అని పాశ్చాత్యమేధావు లంగీకరించి యున్నారు. వీరు సాక్షాత్‌ పరమేశ్వరావతారులు. ఇట్టి వీరి పవిత్రచరిత్రను అచ్చువేయించు మహాభాగ్యము జానకీదేవి దుర్గాప్రసాదరావు దంపతులకు కలిగనది. వారిదివరలో చేసిన పుణ్యకార్యములన్నియు నొకయెత్తు ఈ గ్రంథ ముద్రణము ఒకయెత్తు. ఇట్టి పుణ్యదంపతలుకు సకల సౌభాగ్యములు మరియు సకల శ్రేయస్సులు కలుగుతాయని నారాయణ స్మరణ పూర్వకమగు మాయాశీస్సులు.

ఇంకను ఈ గ్రంథము నచ్చువేయించుటచకు పూర్వరంగములో చేయవలసిన ననేక కృత్యములను ఎంతో జాగరూకతతో నిర్వహించి అచ్చువేయించిన మా పీఠపండితులు సాంగస్వాధ్యాయ భాస్కర, వేదభాష్య శిరోమణి శ్రీ కుప్పా లక్ష్మణావధాని, ''వ్యాకరణ విద్యా ప్రవీణ సాహిత్య విద్యా ప్రవీణవిద్వాన్‌'' శ్రీ జంధ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి రాళ్ళ భండి నరసింహమూర్తి మొదలగు నస్మచ్ఛిష్యులకందరకును సకల శ్రేయస్సులు కలుగుగావుతయని మా నారాయణ స్మరణపూర్వకమగు ఆశీస్సులు.

స్వస్తి.

-విద్యాశంక భారతీస్వామి

శ్రీ గాయత్రీపీఠము, శంకరమఠము

మచిలీపత్తనము కృష్ణామండలము.

శ్రీశంకర చిద్విలాసము

ద్వితీయ ముద్రణము

పీఠిక

ప్రపంచమునకు శాంతి సౌజ్యముల నొసగగల అద్వైత సిద్ధాంతమును స్థాపించి ప్రచారముచేసి ''సర్వజ్ఞ జగద్గురు'' అను సార్థక బిరుదములతో విరాజిల్లిన ఆదిశంకర భగవత్పాదుల దివ్యచరిత్రము అందరిని పవిత్రము చేయును కనుక దానిని నేను ''శంకర చిద్విలాసము'' అను పేరుతో రచించి. అచ్చు వేయించి ది|| 16-5-1964 శంకరజయంతినాడు ప్రకటించడమైనది.

అప్పుడు అచ్చేవేయబడిన 1000 పత్రులను అయిపోవుటచేతను ఈ గ్రంథమును కావలెనని కోరువారు చాలా మంది ఉండుటచేతను ఈ గ్రంథమునకు ద్వితీయ ముద్రణము 1000 ప్రతులు వేయించ నవసరము కలిగినది.

ఈ గ్రంథ ద్వితీయ ముద్రణావశ్యకతను గురించి గుంటూరులో ప్రఖ్యాత పుగాకు వ్యాపారస్తులను. ఆస్తిక్యౌదార్య సంపన్నులను, గొప్ప దాతలును అయిన శ్రీ కొత్తూరు రామయ్య శ్రేష్ఠిగారికి తెలియజేయగా వారు తమ సహజమైన ఔచార్యముతో అందుకుగాను రు 500-లు సమర్పించిరి. ఏలూరు పవరుపేటలోని పట్టాభిరామా ప్రెస్సులో శ్రీ ఈతర పట్టాభి శ్రీరామగారి ఔదార్యాతిశయములవల్ల స్వల్పకాలములో అచ్చువేయించమైనది.

ఇట్లు. ఈ గ్రంథ ద్వితీయముద్రణకు ద్రవ్య సహాయముచేసి, తోడ్పడిన శ్రీ కొత్తురు రామయ్య శ్రేష్ఠిగారికిని, వారికుటుంబమునకును, సకల శ్రేయస్సులు కలుగుగాక అవి మా నారాయణస్మరణ పూర్వక ఆశీస్సులు. శ్రీ ఈదర పట్టాభి శ్రీరామగారికిని, వారికుటుంబమునకును సకల శ్రేయస్సులు కలుగుగాక అని మా ఆశీస్సులు.

విద్యాశంకర భారతీస్వామి

sri Shankara chidvilasamu    Chapters